calender_icon.png 6 February, 2026 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

06-02-2026 05:15:02 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

 రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

షాద్‌నగర్,(విజయక్రాంతి): వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం.. భవిష్యత్తులో అందరికీ అందుబాటులో వైద్యం ఉండేలా వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలో 14 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అందెమోహన్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఏ బాధితుడు కూడా వైద్యం అందుబాటులో ఇబ్బందులు పడడం జరగదని అయన తేలిపారు.

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులను అమలు చేశాం... అదే అభివృద్ధి మున్సిపాలిటీ ఎన్నికలలో  విజయం అందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  ఉమ్మడి పాలమూరు జిల్లా లక్ష్యంగా వైద్య రంగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. బాధితులు వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రాకుండా జిల్లా కేంద్రాల్లోనే వైద్యం అందుబాటులో ఉండేలా ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో అన్ని రకాల సేవ లు అందుబాటులో ఉంటాయన్నారు.

వైద్యానికి సంబంధించి సౌత్ సెంట్రల్ గా పాలమూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవరికి వైద్యం అవసరమైన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా కల్ల పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కేంద్రం, 80 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉమా కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మండలాల వారిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎనిమిదో నిమిషంలో అంబులెన్సులు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్సలు ఏర్పాటు చేసేలా శివారు ప్రాంతాలలో 200 పడకలతో ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ తరహాలోనే 32 డిపార్ట్మెంట్ లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 90% చికిత్సలు ఈ ఆసుపత్రిలోనే జరుగుతాయని ఆయన వెల్లడించారు.  గ్రామీణ వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి డయాబెటిక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రద్ధ చూపెడుతుందని ఇది ప్రజలు గమనించాలని కోరారు.

మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

మున్సిపాలిటీ ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 75 నుంచి 80% సీట్లు కాంగ్రెస్ అందుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టామన్నారు. మహిళా సాధికారికత పేరిట రుణాలు, విద్యా, వైద్య రంగాల్లో పెను మార్పులు, ఉచిత బస్సు, గృహలక్ష్మి పథకాలు. పాలమూరు లాంటి వెనుకబడిన జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, త్రిబుల్ ఐటీ కళాశాల, ఏకీకృత పాఠశాలల నిర్మాణాలు, రేషన్ కార్డులు, ఉద్యోగాల నియామకాలు ఇలా అన్ని రంగాలలోనూ తమ ప్రభుత్వం సత్తా చాటిందన్నారు.

అందుకే ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, వారి సమస్యలు, కష్టాలు విని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం కోసం ప్రణాళికలు చేపట్టడం జరుగుతుందని మంత్రి వివరించారు.