14-08-2025 01:02:06 AM
నేడు పది జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
వాన జోరు.. వరద హోరు
నీట మునిగిన పంటలు పలు చోట్ల ఇండ్లలోకి చేరిన నీరు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపిలేని వాన కురుస్తున్నది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చెరువులు నిండుకుండను తలపిస్తూ మత్తళ్లు దూకుతున్నాయి. పలుచోట్ల వాగులు ఉప్పొంగి రహదారుల మీదుగా ప్రవహించడంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రవా హం తగ్గేవరకు ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.
కొన్ని జిల్లాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల వరిపొలాలు నీట మునిగాయి. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామ సమీపంలో వాగు పొంగి ప్రవహిస్తుండటంతో తొమ్మిది నెలల గర్భిణిని పోలీసు లు, గ్రామస్థులు తాళ్ల సాయంతో వాగు దాటించారు.
నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామం వద్ద మూసీనది ఉధృతం గా ప్రవహిస్తుండటంతో అధికారులు సమీప గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో 9 గేట్లు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో అధికారులు జలాశయం 26 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
- నీట మునిగిన పంటలు
- పలు చోట్ల ఇండ్లలోకి చేరిన నీరు
- మంచిర్యాల జిల్లాలో తాళ్ల సాయంతో గర్భిణిని వాగు దాటించిన పోలీసులు
- కరీంనగర్ జిల్లాలో పెళ్లి కొడుకుని భుజాలపై వాగు దాటించిన బంధువులు
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, ఆగస్టు 13: మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి వాగు పొంగి పొర్లింది. ఇందుర్తి ఎల్లమ్మ వాగు బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిచింది. దీంతో ఇక్కడి నుంచి కోహెడకు, కో హెడ నుంచి కరీంనగర్‌కి రాకపొకలు నిలిచి పోయాయి.
సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్డుపై ఏర్పడ్డ పెద్ద గోతిలో వర్షపు నీరు నిలిచింది. అది గమనించక ద్విచక్రవాహనంపై వెళ్లిన వృద్ధ జంట ఆ గోతిలో పడిపోయింది. దీంతో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో భారీగా కురిసిన వర్షానికి అంతారం చలిమెడ గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగిపొర్లుతుంది.
దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంకల్ నుంచి వస్తున్న ప్రయాణికులు వాగు దాటేందుకు ఇబ్బంది పడుతున్నారు. అలాగే బొడ్మెట్పల్లి, లింగంపల్లి గ్రామాల మధ్య వంతెనపై వరద నీరు పొంగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యా ప్తంగా ఉదయం నుంచి రాత్రి వరకు భారీగా వర్షం కురిసింది. రోడ్లతోపాటు వాగులు వర్షపు నీటితో నిండుగా ప్రవహించాయి.
జలమయమైన ట్రై సిటీ
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాలు జలమయమయ్యాయి. కుం డపోత వర్షాలకు ముంపు ప్రాంతాలన్నీ అతలాకుతలం అయ్యాయి. గంటల వ్యవధిలోనే 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ నిపుణులు తెలిపారు. ట్రైసిటీలోని పలు కాలనీలు జలమలం అయ్యాయి.
శివనగర్, అండర్ బ్రిడ్జి, లక్ష్మీపురం, ఎల్బీనగర్, చింతల్, లోతుకుంట, లేబర్ కాలనీ, ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాం తాలు తోపాటు హనుమకొండలోని పోచ మ్మ కుంట, గుండ్ల సింగారం, నయీమ్ నగర్, గోకుల్ నగర్, హంటర్ రోడ్, సమ్మ య్య నగర్, ఎల్ వెంకట్ రమణయ్య నగర్, సుందరయ్య నగర్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాజీపేటలోని సోమిడి, అయో ధ్య పురం, ఫాతిమా నగర్, కడిపికొండ, డీజిల్ కాలనీ ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి నగర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న ఊక చెట్టి వాగు
వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సరళసాగర్ నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు సరళ సాగర్‌కు నీటి ప్రవాహం రావడంతో నిండి రెండు సైబన్లు తెరుచుకున్నాయి. దీంతో ఊకచేట్టి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మదనాపురం రైల్వే గేట్ సమీపంలో వాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు నుంచి కొత్తకోట వనపర్తికి రాకపోకలు నిలిచిపోయాయి.
నేరేడుచర్లలో మూసీ ఉధృతి
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని వాగులు ఉధృ తంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు సైతం పూర్తిగా నిండి నిండుకుండను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామం వద్ద మూసినదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు సమీప గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నేరేడుచర్ల పట్టణం లోని ఉత్తం పద్మావతి నగర్‌లో గల గుడిసెల్లోకి నీరు చేరడంతో సామగ్రి మొత్తం తడిసిపోయింది. జాన్‌పహాడ్ రోడ్డు పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. సూర్యాపేట వయా భీమవరం మిర్యాలగూడ రోడ్డు లో కేసారం వద్ద రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించ డంతో సంగం బంధం వద్ద రైతుల పంట పొలాలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల వందల ఎకరాలలో పొలాలు నీట మునిగాయి.
తాళ్ల సాయంతో గర్భిణిని వాగు దాటించిన పోలీసులు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామ సమీప వాగు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలోనే మండలంలోని దొడ్డిగూడెంకు చెందిన యమున అనే తొమ్మిది నెలల గర్భిణికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
నర్సాపూర్ వాగు ఉధృతికి వాగు దాట లేకపోయారు. విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్సు కిరణ్‌కుమార్, పోలీసు సిబ్బంది కలిసి తాడు సాయంతో వాగు అవతలి వైపు వెళ్లి గర్భిణిని సురక్షితంగా ఇవతలి వైపు తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
మరో 3 జిల్లాలోని పాఠశాలలకు సెలవులు
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో గురువారం మరో మూడు జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవును ప్రకటించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని స్కూళ్లకు గురువారం ఒక్క పూట సెలవును ఇవ్వగా, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని బడులకు పూర్తి సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే.
10 జిల్లాలకు రెడ్ అలర్ట్
-ఆయా జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలి
- వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండురోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక గురువారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ములు గు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
గురు వారం రోజే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు.. ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి అని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 17 వరకు రాష్ర్టవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
పెళ్లికొడుకున వాగు దాటించిన బంధువులు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం ఊర చెరువు మత్తడి ప్రవాహం ఎక్కువై రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలో జరగాల్సిన పెళ్లికి బయలుదేరిని పెళ్లికొడుకు, బంధువుల వాహనం వరద ఉధృతితో ఆగిపోయింది. దీంతో బంధువులే పెళ్లి కొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చి మరో వాహనంలో తీసుకెళ్లారు. లో లెవెల్ కల్వర్టు సమస్యతో గన్నేరువరం మండల ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు.
నాలాలో పడిన మహిళ..
మహబూబ్‌నగర్ పట్టణంలోని పాత బస్‌స్టాండ్ సమీపంలో కిద్వాయిపేట వైపు వెళ్లే దారిలోని పెద్ద కాలువలో ఎల్లమ్మ అనే వృద్ధురాలు బుధవారం పడిపోయింది. గమనించిన స్థానికులు డయల్ 100కి కాల్ చేయగా.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య, ఫైర్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జనజీవనానికి ఆటంకాలు కలగొద్దు
-ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు చేపట్టాలి
- రెవెన్యూ యంత్రాంగానికి మంత్రి పొంగులేటి ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాం తి): భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
భారీ వర్షాలపై ఆయా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు. విపత్తుల నిర్వహణ శాఖ ఆయా జిల్లాల్లో ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్, రహదా రులు, పోలీస్ విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ర్టంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి గురించి ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తున్న హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాల పల్లి తదితర జిల్లాలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ విభాగం నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలసత్వం వద్దు
-ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా పెట్టండి
-నీటిపారుదలశాఖలో అన్ని విభాగాలకు సెలవులు రద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ర్టంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉం దంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా పనిచేస్తున్న నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాగార్జునసాగర్, జూరాల, కడెంతో సహా ప్రధాన ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా పెట్టాలన్నారు. కాల్వ కట్టలు తెగిపోయే వాటిని గుర్తించి ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అదే సమయంలో నీటిపారుదల శాఖాధికారులు రెవెన్యూ, పోలీస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లతో సహా అన్ని విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ విపత్తులు సంభవించకుండా చర్యలు చేపట్టలన్నారు.
‘మానేరు’పై చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ. 35 కోట్లు ఉత్తర్వులు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబా ద్ మండలం నీరుకుల్ల గ్రామం వద్ద మానేరు వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం రూ. 35.54 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
పుట్టంగండి వద్ద మోటార్ అమర్చాలి మంత్రి ఉత్తమ్‌కి మండలి చైర్మన్ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : ఏఎంఆర్‌పీ ప్రాజెక్ట్ 5వ యూనిట్, పుట్టంగండి వద్ద మోటార్‌ని అమర్చి సాగునీరు అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. ఈ మోటార్ ద్వారా నల్లగొండ జిల్లాలోని 21 మండలాల్లో 3.20 లక్ష ల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపా రు. ఈ మేరకు బుధవారం మంత్రి ఉత్తమ్‌కు గుత్తా సుఖేందర్‌రెడ్డి లేఖ రాశారు. కేవలం రూ. 148.30 కోట్ల నిధులు మంజూరు చేస్తే జిల్లాలోని రైతులకు లాభం చేకూరుతుందన్నారు.