calender_icon.png 14 August, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చేదేదో 50 శాతం ఇవ్వండి!

14-08-2025 01:05:24 AM

పార్టీపరంగా ఇవ్వడంలో న్యాయపరమైన, చట్టపరమైన సవాళ్లు ఏమీ లేనప్పుడు దామాషా ప్రకా రం రిజర్వేషన్ అమలుచేయడంపై పార్టీలన్నీ ఆలోచించాలని బీసీ వర్గాలు సూచిస్తున్నాయి. చట్ట సవరణతో అయితే 42 శాతం, పార్టీ పరంగా అయి తే దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు బీసీలకు ఇచ్చే 50 శాతం రిజర్వేషన్లలో సగం బీసీ మహిళలకు కేటాయించేలా ప్రకటన చేయాలని కోరుతున్నాయి. 

ఇప్పటికే అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్రం కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లుతో మరోసారి దేశానికి దిక్సూచిగా మారింది. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో జరగని కులగణనను రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ ధాటికి మసకబారుతున్న కాంగ్రెస్ ప్రతిష్ఠను నిలబెట్టుకొనే అవకాశాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది.

తద్వారా దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకొనే మార్గాన్ని సుగమం చేసింది. ఈ ప్రక్రియలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అంశం కీలకంగా మారింది. దీని కోసం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటికే రాష్ట్ర పరిధిలో చేయగలిగిందంతా చేసింది. ఢిల్లీలోనూ ధర్నా పేరిట అన్ని పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నించింది. దీంతో బీసీల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల దృక్పథం ఏర్పడింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు మోకాలడ్డుతున్నది.

ఈ క్రమంలో చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయడం కొంత కష్టతరంగా మారుతున్నది. చట్ట సవరణతో 42 శాతం రిజర్వేషన్ సాధ్యంకాని పక్షంలో పార్టీ తరఫున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాస్తవానికి బీసీలు చట్టబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లే కోరుకుంటున్నారు. పార్టీపరంగా ఇచ్చే దిశగా కాంగ్రెస్ యోచిస్తున్న తరుణంలో బీసీలు మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. 

50 శాతం ఇవ్వొచ్చు కదా..

వాస్తవానికి ‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో బీసీలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ తరఫున రిజర్వేషన్లు కేటాయించే చర్చ జరుగుతుండటంతో తమ ప్రాతినిధ్యాన్ని పెంచడంపై ఆయా పార్టీలు దృష్టి సారించాలని బీసీలు కోరుతున్నారు. పార్టీ తరఫున ఇవ్వడంలో, 42 శాతానికి బదులుగా 50 శాతం సీట్లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 18 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారు.

వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ దక్కుతున్నది. అదేవిధంగా బీసీలు 56 శాతం ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేతో స్పష్టమైంది. ఈ క్రమంలో తమకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చినా దామాషా కంటే తక్కువగానే రిజర్వేషన్ లభిస్తుందని బీసీలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం చట్టబద్ధంగా రిజర్వేషన్ సాధ్యమైనప్పుడు, బీసీలకు కనీసం పార్టీపరంగా 50 శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నిస్తున్నారు.

పార్టీపరంగా ఇవ్వడంలో న్యాయపరమైన, చట్టపరమైన సవాళ్లు ఏమీ లేనప్పుడు దామాషా ప్ర కారం రిజర్వేషన్ అమలుచేయడంపై పార్టీలన్నీ ఆలోచించాలని సూచిస్తున్నారు. చట్ట సవరణతో అయితే 42 శాతం, పార్టీ పరంగా అయితే దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతోపాటు బీసీలకు ఇచ్చే 50 శాతం రిజర్వేషన్లలో సగం బీసీ మహిళలకు కేటాయించేలా ప్రకటించాలని కోరుతు న్నాయి. 

ముందే ప్రకటించాలి.. అంతా అమలు చేయాలి..

అయితే పార్టీ తరఫున రిజర్వేషన్ల అమలుచేయడంపై బీసీలు కొంతమేర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నప్పటికీ, దానికి కారణం లేకపోలేదు. నియోజకవర్గంలో ఒక పార్టీ బీసీకి సీటు ప్రకటించిన తర్వాత వేరే పార్టీలు అగ్రవర్ణాల అభ్యర్థులను బరిలో నిలిపితే తమకే నష్టం జరుగుతుందని బీసీలు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు పార్టీ పరంగా రిజర్వే షన్ ఇచ్చినా, బీసీలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని అంటున్నారు.

అయితే చట్టబద్ధంగా రిజర్వేషన్ సాధ్యంకాని పక్షంలో, పార్టీపరంగా ఇవ్వడం మాత్రమే పరిష్కారమార్గం అయినప్పుడు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. పార్టీపరంగా రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ బీసీలకు అన్యాయం జరగకకూడదంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించే నియోజకవర్గాలను ముందే ప్రకటించి చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. నిర్ణయాన్ని అమలుచేసే విధంగా అన్ని ప్రధాన పార్టీలకు పిలుపునివ్వాలి.

ఈ కార్యాచరణ అమలుకు అన్ని పార్టీలను ఒప్పించే బాధ్యతను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు పార్టీ తరఫున 50 శాతం రిజర్వేషన్, బీసీలకే కేటాయించే నియోజకవర్గాల ను ముందే ప్రకటించడం, అన్ని పార్టీలు దీని ని అమలు చేసే విధంగా ఒప్పించడం ద్వారా మాత్రమే బీసీలకు న్యాయం జరిగే అవకా శం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పార్టీపరంగా రిజర్వేషన్ ఇవ్వడం తాత్కాలికమే అయినప్పటికీ కనీసం దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాయన్న సంతృప్తి బీసీలకు కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. 

ఇప్పటికే నిధులు పెండింగ్..

రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఏ నిర్ణయమైనా వీలైనంత త్వరగా తీసుకోవాలి. చట్టబద్ధంగానో లేక పార్టీపరంగానో బీసీ రిజర్వేషన్ అంశాన్ని సాధ్యమైనంత తొందరగా కొలిక్కి తీసుకురావాలి. బీసీ రిజర్వేషన్ల అంశంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ముడిపడి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు వేగవంతం చేయాలి. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ జాప్యం జరుగుతున్న కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు నిధుల కొరతతో తీవ్రంగా నష్టపోతున్నాయి. వాస్తవానికి గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు మంజూరు అవుతాయి. కానీ కేంద్ర వాటా కింద రావాల్సిన నిధుల మంజూరుకు పంచాయతీ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం సాకుగా చూపుతు న్నది. తద్వారా ఏడాదిన్నర కాలంగా కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. గతేడాది వరకే రూ. 1,570 కోట్ల కేంద్ర నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మరో రూ. 700 కోట్లకుపైనే పెండింగ్‌లో ఉన్నాయి.

మొత్తంగా తెలంగాణలోని గ్రామాలకు కేంద్రం నుంచి సుమారు రూ. 2300 కోట్ల వరకు నిధులు  రావాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతున్న క్రమంలో నిధులు మంజూరు కాక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

పంచాయతీ ఎన్నికల నిర్వహణ జాప్యం జరుగుతున్న కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. గ్రామాలు నిధుల కొరతతో తీవ్రంగా నష్టపోతున్నాయి. కేంద్ర వాటా కింద రావాల్సిన నిధుల మంజూరుకు పంచాయతీ ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం సాకుగా చూపుతున్నది. ఏడాదిన్నర కాలంగా కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. గతేడాది వరకే రూ. 1,570 కోట్ల కేంద్ర నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి మరో రూ. 700 కోట్లకుపైనే పెండింగ్‌లో ఉన్నాయి.