19 August, 2026 | 3:39 AM

నల్గొండను నంబర్‌వన్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం

19-08-2026 12:24 AM

రూ.23.85 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి

నల్లగొండ టౌన్, ఆగస్టు 18: నల్గొండ పట్టణo లో సిసి రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, తాగునీరు, విద్యుత్, పార్కులతో అన్ని సౌకర్యాలున్న పట్టణంగా, తెలంగాణలోనే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం కార్పొరేషన్ పరిధిలో 23 కోట్ల 85 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తో కలిసి శంకుస్థాపనలు చేశారు.

3వ డివిజన్ ఎస్టీ కాలనీ నుంచి శేషమ్మగూడెం మీదుగా అద్దంకి రహదారి వరకు రూ.9.40 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు, పానగల్ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు నుంచి డీఈఓ ఆఫీసు వరకు 14.45 కోట్లతో 3 కి.మీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణానికి బయట 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు, పట్టణంలో 500 కోట్లతో సిసి రోడ్లు, డ్రైన్లు పనులు జరుగుతున్నాయన్నారు. రూ.83 కోట్లతో 24 గంటల తాగునీటి ప్లాంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి మరో రూ.300 కోట్లు తెచ్చామని చెప్పారు. రూ.125 కోట్లతో 12 వాటర్ ట్యాంకులు చేపట్టగా, డిసెంబర్ నాటికి 11 ట్యాంకులు పూర్తవుతాయన్నారు. ప్రధాన కాలనీలు, శివారు గ్రామాల్లో రూ.3 కోట్ల చొప్పున సబ్ స్టేషన్లు, పార్కుల అభివృద్ధి, స్మశాన వాటికలు, దేవాలయాలు, మసీదులు కడుతున్నామన్నారు.

700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, 15న 552 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిష్పక్షపాతంగా ఇచ్చామని తెలిపారు. లతీఫ్ సాబ్ గుట్ట, శివాలయం గుట్టలకు రూ.150 కోట్లతో రోడ్లు, రోప్ వే ఛాయా సోమేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్ల ప్రతిపాదనలు పంపామని, ఎన్జీ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మహిళా సంఘాల కోసం 3 కోట్ల పెట్రోల్ పంపు, 2 కోట్ల సూపర్ మార్కెట్ ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్,డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మున్సిపల్ కమిషనర్ వంశీ, కార్పొరేటర్లు యామ కవిత, యాదయ్య, స్వాతి, నవరత్నారాజు, వేణుగోపాల్ రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.