29-01-2026 11:55:52 AM
హైదరాబాద్: మేడారం మహా జాతర(Medaram Maha Jatara) పకడ్బందీగా కొనసాగుతుందని, సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. గురువారం ఉదయం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , అడ్లూరి లక్షణ్ కుమార్, మేడారం జాతర ఏర్పాట్లను బైకులపై జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు గల ఏర్పాట్లను, పరిసర ప్రాంతాల పారిశుద్ధ్యం స్వయంగా తిరిగి పరిశీలించిన మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు.
జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే మహా జాతరలో తప్పిపోయిన వ్యక్తులను తిరిగి వారి కుటుంబానికి చేర్చే దిశగా తప్పిపోయిన వ్యక్తుల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం మహా జాతర సందర్భంగా పారిశుధ్య చర్యలు కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. జాతరలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తుందని వెల్లడించారు. మేడారం పరిసరాలతో పాటు భక్తుల దర్శనానికి వెళ్లే అన్ని సెక్టార్లలో పరిశుభ్రత పాటించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అమ్మవారి గద్దెల వద్ద శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టడం జరిగిందన్న మంత్రి పొంగులేటి అధికారుల నిరంతర పర్యవేక్షిస్తూ గద్దెల వద్ద బెల్లం, భక్తులు సమర్పించే మొక్కులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారని సూచించారు.