29-01-2026 11:28:56 AM
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించిందని ప్రధాని మోదీ(PM Narendra Modi) పార్లమెంట్ వద్ద మాట్లాడుతూ అన్నారు. ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచికమని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అన్నారు. వికసిత్ భారత్ కోసం ఎంపీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధాని తెలిపారు. ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. సామాన్య ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని పేర్కొన్నారు.
సాంకేతికతలో సరికొత్త ఆలోచనలకు ప్రాధాన్యమిస్తున్నామని సూచించారు. అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. వార్షిక బడ్జెట్ కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సభ్యులకు మార్గనిర్దేశం చేస్తూ కొన్ని విషయాలు చెప్పారు. ఈ బడ్జెట్ సెషన్ చాలా ముఖ్యమైనదని తెలిపారు. 21వ శతాబ్దంలో పావువంతు గడిచిపోయిందని వెల్లడించారు. నిర్మలాసీతారామన్ వరసగా 9వసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం దృష్టి బడ్జెట్, ఆర్థిక సంస్కరణలపై ఉందన్నారు. ఇది పరిష్కాల సమయం, అంతరాయం సృష్టించే సమయం కాదని హితవు పలికారు.