మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించడమేంటి?
- కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు
కరీంనగర్, జూన్ 19 (విజయక్రాంతి): జిల్లాకు సంబంధం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగరపాలక సంస్థ సమీక్షా సమావేశం నిర్వహించడమేంటని నగర మేయర్ వై సునీల్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలో బుధవారం బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కాదని, మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని తప్పించి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జిల్లా ఇంచార్జి మంత్రిగా ఎవరైనా కేటాయించారా? అనే సందేహం వస్తుందన్నారు.
గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన పొన్నం నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఆ నియోజకవర్గ అభివృద్ధిపై పొన్నం దృష్టి సారిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నగరపాలక సంస్థ ఎన్నో అవార్డులు సాధించిందని గుర్తుచేశారు. పొన్నం అధికారులను భయపెట్టే మనస్తత్వాన్ని మార్చుకోవాలన్నారు.
ఆయనకు స్మార్ట్ సిటీ అంటే తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రికి దమ్ముంటే వచ్చే బడ్జెట్‌లో నగరపాలక సంస్థ అభివృద్ధికి రూ.200 కోట్లు నిధులు పెట్టించాలన్నారు. ఎంపీగా బండి సంజయ్ నగర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారని అన్నారు. కేంద్ర మంత్రి హోదాలో నగరపాలక సంస్థ అభివృద్ధికి ఇంకా నిధులు తీసుకురావాలని బండి సంజయ్‌ని కోరుతున్నామన్నారు.






