19 May, 2026 | 1:26 AM

రైస్ మిల్లర్ల జులుం!

20-06-2024 12:34 AM
  • అమ్ముకున్నాం.. అయితే ఏంది?
  • సర్కారు ధాన్యంతో దందా
  • ధాన్యం వెల్లుడే.. బియ్యం తిరిగొచ్చుడు లేదు 
  • అడ్రస్ లేని మిల్లులకూ కోట్ల కొద్దీ ధాన్యం

ఏండ్లుగా పేరుకుపోయిన సీఎంఆర్ 

మిల్లర్లతో కిందిస్థాయి అధికారుల కుమ్మక్కు 

పెద్ద అధికారులపై కూడా మిల్లర్ల ఆధిపత్యం

ఇస్తే తీసుకోండి.. లేదంటే ఊరుకోండి అన్నట్టుగా తీరు

మళ్లీ అవే మిల్లులకు ధాన్యం ఇస్తున్న ప్రభుత్వం 

వందల కోట్ల ధాన్యం మిల్లుల్లోనే మాయం

* కల్లం నుంచి ధాన్యం మిల్లుకు వెళ్లుడేగాని.. తిరిగి ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యం వచ్చుడు లేదు. ప్రభుత్వం రైతులకు పైసలిచ్చి కొన్న ధాన్యాన్ని మరాడించేందుకు మిల్లులకు పంపితే.. సీఎంఆర్ బియ్యాన్ని తిరిగివ్వాల్సిన మిల్లర్లు దర్జాగా మార్కెట్లో అమ్ముకొని సొమ్ముచేసుకొంటున్నారు. కొన్నేండ్లుగా ఇదే తంతు.. బియ్యం ఏవి అని అధికారులు అడగరు.. ఇస్తాం తీసుకోండని మిల్లర్లు ఇవ్వరు.. అసలు ఉంటే కదా ఇవ్వటానికి. కొత్త ప్రభుత్వం రాగానే ఎవరికి ఎంత ధాన్యం వెళ్లింది? తిరిగి బియ్యం ఎంత వచ్చింది? అని లెక్కలు తీసుడు మొదలుపెట్టింది. దీంతో సర్కారు బియ్యం బుక్కిన ఘనాపాటి మిల్లర్లు రాజకీయం మొదలుపెట్టారు. 

* వీలైతే కవర్ చేద్దాం.. లేదంటే బ్లాక్‌మెయిల్ చేద్దాం అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. ఒక్క జిల్లా అనేమీ లేదు.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అదే విధానం. బియ్యం లేవ్.. ఏం చేసుకొంటారో చేసుకోండి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కొందరు మిల్లర్లు. నిజామాబాద్‌లో తనిఖీలకు వెళ్లిన ఐఎస్‌ఎస్, ఐపీఎస్ అధికారుల బృందాన్ని తమ లాబీయింగ్‌తో వెనక్కి తరిమేయటమే ఇందుకు చక్కటి ఉదాహరణ. 

 విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, జూన్ 20: సూర్యాపేట జిల్లాలో 2022 ఖరీప్ నుంచి 2023 రబీ సీజన్ వరకు నాలుగు సీజన్ల సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉన్నది. ఈ నాలుగు సీజన్లకు కలిపి 6,27,039 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉండాలని లెక్కలు చెప్తున్నాయి. కానీ మిల్లుల్లో అనుకున్న స్థాయిలో నిల్వలు లేవని అధికారులు చెప్తున్నారు. 

* 2019 ఖరీఫ్ సీజన్ నుంచి 2021 రబీ సీజన్ వరకు జిల్లాలో రూ.81.68 కోట్ల విలువ గల 29,598 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించవలసి ఉన్నది. 

* 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన 21,257 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ మిల్లర్లు ఇంకా బకాయి ఉన్నారు. దీని విలువ రూ.58.50 కోట్లు. అంటే ఈ సీజన్‌కు సంబంధించి 28,271 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉండాలి. 

* 2022  రబీ సీజన్‌కు 70 మిల్లులకు కేటాయించిన 2,07,636 మెట్రిక్ టన్నుల ధాన్యం టెండర్ ద్వారా విక్రయించారు. ఇందులో కేవలం 500 మెట్రిక్ టన్నుల ధాన్యం టెండర్‌దారులకు అప్పగించగా, మిల్లుల వద్ద 2,07, 136 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉండాలి.

* 2023 ఖరీఫ్‌లో జిల్లాలో 64 మిల్లులకు 2,08,175 మెట్రిక్ టన్నుల ధాన్యం అందించారు. ఇందుకు 1,39,477 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వా ల్సి ఉండగా, ఇప్పటి వరకు 42,913 మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారు. మూడు మిల్లులు మాత్రమే 100 శాతం టార్గెట్ పూర్తి చేశాయి. ఈ సీజన్‌లో ఇంకా 1,51,101 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దనే ఉన్నది.  

* 2023 రబీ సీజన్‌లో 2,40,531 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించి 64 మిల్లులకు అందించారు. ఈ ధాన్యం సీఎంఆర్ సేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. 

* 2022 ఖరీఫ్ నుంచి 2023 రబీ సీజన్ వరకు మిల్లులకు కేటాయించిన ధాన్యంలో సీఎంఆర్ పోగా 6,27,039 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉండాలి. సీఎంఆర్ అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా టాస్క్‌పోర్స్ టీం సంతోషి, రఘురామ, శ్రీ వెంకటేశ్వర, జగన్‌మాత మిల్లుల్లో తఖీలు నిర్వహించింది. జగన్‌మాత మిల్లు మినహా ఎక్కడా ధాన్యం నిల్వలు లేవని గుర్తించిన అధికారులు, వారిపై కేసు నమోదుచేసి రెండు మిల్లుల యాజమానులను అరెస్ట్ చేశారు.  

* కామారెడ్డి జిల్లాలో 36 రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యం బకాయి పడ్డారు.

* జిల్లాలో 165 రైస్ మిల్లులున్నాయి. వీటిలో 37 మిల్లర్లు ప్రభుత్వం ధాన్యాన్ని తీసుకొని సీఎంఆర్ రైస్‌ను తిరిగివ్వకుండా బయట మార్కెట్లో అమ్మేశారు. వీరు 23, 276 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, ఇప్పటివరకు బిచ్కుంద మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన మెసేజ్ సిద్ధి వినాయక ఇండస్ట్రీస్ యజమాని మాత్రమే 120.83 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గత నెలలో ప్రభుత్వానికి అప్పగించారు. మిగతా 36 మంది 23,154 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది.

* కొన్ని రైస్ మిల్లులు బినామీ పేర్లతో ఉన్నాయి. కొన్నింటికి అడ్రస్‌లే లేవు. కామారెడ్డి సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో శ్రీ సాయి కిరణ్ రైస్ మిల్ ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారుల రికార్డుల్లో ఉన్నది. ఫోన్ నంబర్ కూడా ఉన్నది. ఇప్పుడు ఆ ఫోన్ నంబర్ పని చేయడం లేదు. ఆ ప్రాంతంలో రైస్ మిల్లే లేదు. అధికారులు ఆ రైస్ మిల్‌కు ధాన్యాన్ని ఎలా అప్పజెప్పారో వారికే తెలియాలి. 

* నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్‌లో విష్ణు రైస్ మిల్లు 515 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, ఇప్పుడు మిల్లులో 100 కింటాళ్ల బియ్యం కూడా లేవు. ముక్కిపోయిన బియ్యాన్ని లారీలో లోడ్ చేస్తూ కనిపించారు. ఎక్కడి నుంచో తెచ్చిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు లారీలో నింపుతూ కనిపించారు. 

* నిజామాబాద్ జిల్లాలో 2012 సీజన్ నుంచి ఇప్పటి వరకు 69 రైసు మిల్లర్లు డిఫాల్టర్లుగా తేలారు. వీరు ప్రభుత్వం నుంచి 1,03,876.179 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నారు. తిరిగి 70,201 .444 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 15.943.119 టన్నులు మాత్రమే ఇచ్చారు. వీరు 25 శాతం పెనాల్టీతో కలుపుకుని మరో 69.488.386 టన్నుల బియ్యం ఇవ్వాల్సిఉంది. 

* జిల్లాలో మొత్తం 69 మంది డిఫాల్టర్ రైసు మిల్లర్లు ఉండగా, వీరిలో 22 మంది పెనాల్టీతో సీఎంఆర్ రైస్ ఇచ్చారు. మరో 47 మంది మాత్రం సీఎంఆర్ రైస్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ 47 మందిలో 21 మందిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించగా, మరో 18 మందికి వివిధ సెక్షన్ల కింద నోటీసులు జారీచేశారు.  

* జిల్లాలో 2012 ఖరీఫ్ సీజన్‌లో ఒకటి, 2014 ఖరీఫ్ సీజన్‌లో ఆరు, 2016 రబీ సీజన్‌లో మూడు, 2017 ఖరీఫ్ సీజన్‌లో ఒకటి, 2019 రబీ సీజన్‌లో నాలుగు, 2020 రబీ సీజన్‌లో మూడు, 2021 ఖరీఫ్ సీజన్‌లో 15.. 2021 రబీ సీజన్‌లో 22.. 2022 ఖరీఫ్ సీజన్‌లో 14 రైస్ మిల్లులు డిఫాల్టర్‌గా తేలాయి. 

* పెద్దపల్లి జిల్లాలో ౨౦౨ మిల్లులున్నాయి. గత ఖరిఫ్ సీజన్‌లో ఈ మిల్లులు ౧.90 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బాకీ పడ్డాయి. అందులో కొంత సరఫరా చేయగా ఇంకా 75 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉన్నదని జిల్లా పౌరసరఫరాల డీఎం  శ్రీకాంత్ తెలిపారు. 

* ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో 138 రైస్ మిల్లులు 3.98 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాలి ఉండగా.. 3.34 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ తిరిగి వచ్చిందని శ్రీకాంత్ తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో రావాల్సిన బకాయి ఇంకా రాలేదు. 

తనిఖీలకు ససేమిరా 

నిజామాబాద్ జిల్లాలో గత నెలలో మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో డీఎస్‌వో చంద్రప్రకాష్, సీఎంఆర్ ధాన్యం రికవరిలో వైఫల్యం చెందిన సివిల్ సఫ్లు డీఎం జగదీష్ బాబును సివిల్ సప్లు కమిషనర్ డీ ఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్ల నుంచి రికవరీ సాధ్యం కాకపోవడంతో రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సైతం కమిటీని ఏర్పాటు చేసి, మిల్లులు తనిఖీకి పంపింది. అయితే, మిల్లర్లు సివిల్ సప్లు శాఖ అధికారుల యత్నాలను అడ్డుకున్నారు. అధికారుల కమిటీ తనిఖీలు చేపట్టకుండా చక్రం తిప్పారు. జిల్లాలో రైస్ మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని, ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి భారీగా లబ్ధిపొందారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బియ్యం లేవు.. మిల్లూ లేదు

సీఎంఆర్ ధాన్యం మాయం కావటానికి మిల్లర్లతోపాటు ప్రభు త్వం కూడా కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వరిపంట దిగుబడి పెరగటంతో మరాడించేందుకు మిల్లుల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా కొంద రు వ్యాపారులు తెలివిగా పేపర్లపై మిల్లులను స్థాపించారు. ఆ పేపర్లు చూపించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ ధాన్యం అలాట్ చేయించుకొన్నారు. కేటాయింపు ప్రకారం ధాన్యం మిల్లుకు వెళ్లింది. అటునుంచి అటే మాయమైంది. ఇప్పుడు అధికారులు ధాన్యం ఎక్కడుందో చూద్ధామని తనిఖీలకు వెళ్తే ధాన్యం లేదు.. బియ్యం లేవు.. ఇచ్చిన అడ్రస్‌లో అసలు మిల్లే లేకపోవటంతో అధికారులు అవాక్కవుతున్నారు. 

 గడువులోగా బియ్యం ఇవ్వకుంటే చర్యలు

కామారెడ్డి జిల్లాలో 36 రైస్‌మిల్లుల యజమానులు ప్రభుత్వానికి 23, 154 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సి ఉంది. ఈ నెల 30లోగా ప్రభుత్వానికి బియ్యం అప్పగించుకుంటే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం.

 మల్లికార్జున్ బాబు, 

జిల్లా పౌరసరఫరాలశాఖ 

అధికారి, కామారెడ్డి