09-12-2025 11:23:50 AM
హైదరాబాద్: మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు , సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9,2023 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిందని మంత్రి వెల్లడించారు. నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు 8459 కోట్ల విలువైన ప్రయాణం పొందగలిగారని వివరించారు.
దీని ద్వారా కుటుంబాల బంధుత్వాలు పెరగడం, దేవాలయాల సందర్శన, హాస్పిటల్ చికిత్సలు, విద్య వ్యవస్థ మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకుని ఇంకా అనేక రకాలుగా మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించుకున్న ఈ పథకం రెండు సంవత్సరాలుగా విజయవంతంగా మహిళా సాధికారతకి ఉపయోగపడుతోందన్నారు. బస్సుల్లో ప్రయాణం చేయడమే కాదు, మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. తెలంగాణ అక్కా చెల్లెలకు,ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి రవాణా శాఖ మంత్రిగా ఆయన శుభాకాంక్షలు చెప్పారు.