14 April, 2026 | 6:51 PM

సమ్మె నిర్ణయం సరైంది కాదు— TGSRTC సిబ్బందికి మంత్రి పొన్నం విజ్ఞప్తి

14-04-2026 02:54 PM

హైదరాబాద్: తాము తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆర్టీసీ ఉద్యోగులను కోరారు. ఇటువంటి చర్య సంస్థపై, అలాగే ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఒక ప్రకటనలో, TGSRTC సిబ్బందికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చలు, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను విన్నవించుకోవడానికి, పరిష్కారాలను కోరడానికి ప్రభుత్వ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలులోకి తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎలాంటి డీఏ బకాయిలు లేవని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సెప్టెంబర్ 2023న కమిటీ ఏర్పాటు చేసిందన్న మంత్రి పొన్నం ఎన్నికల షెడ్యూల్‌కు ముందు హడావిడిగా ఈ అంశాన్ని ముందుకు తీసుకువచ్చిన విషయాన్ని తాను గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటు అయ్యాక కొద్ది రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిందని సూచించారు. ఆ తరువాత లోకసభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా కోడ్ అమలులో ఉండటం వల్ల ఈ అంశంపై సమగ్రంగా ముందుకు వెళ్లడం ఆలస్యమైందని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి ఆర్టీసీ సేవలను బలోపేతం చేశామని తెలిపారు. ఒకప్పుడు ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్టీసీ ఉనికికే.. ఇప్పుడు 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ఈ మూడు అంశాలకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఉద్యోగుల ప్రభుత్వ విలీనంపై కమిటీ సమగ్ర అధ్యయనం అవసరమన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైనది కాదని మంత్రి భావించారు. ఇది సంస్థకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీకి అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. గతంలో రూ.1205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామన్నారు. అలాగే రూ.690 కోట్లుగా ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామన్నారు. 1134 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామన్నారు. కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి, త్వరలోనే అభ్యర్థులు విధుల్లో చేరనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.