23-04-2025 11:17:34 PM
ప్రభుత్వంలో ఉండి కూడా సబ్ ప్లాన్ కోసం కొట్లాడుతున్న..
గొల్ల, కురుమ కార్పొరేషన్లు సఫరేట్ అయ్యేలా సీఎంతో మాట్లాడుతా..
దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్..
హుస్నాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాను ఎంపీగా ఉండి కూడా తెలంగాణ కోసం గొంతు విప్పానని, ఇప్పుడు రాష్ట్రంలో మంత్రిగా ఉండి కూడా బీసీలకు సపోర్టుగా సబ్ ప్లాన్ కోసం కొట్లాడుతున్నానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం రాత్రి ఆయన సిద్దిపేట జిల్లా కోహెడలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు.
19 ఏండ్ల వయస్సులో చరిత్ర సృష్టించిన దొడ్డి కొమురయ్య వందేండ్లైనా ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. "అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో మనం రాజకీయంగా అవకాశాలు సాధించాలి. సమాజంలో తలెత్తుకొని బతకాలంటే విద్య అవసరం. పిల్లలను గొర్రెల కాపరికి పంపాలనే ఆలోచన మానుకొని బాగా చదివించాలి" అని పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలైతే రాజకీయంగా అందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు. "త్వరలోనే గొల్ల, కురుమ కార్పొరేషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వంలో ఉండి సబ్ ప్లాన్ కోసం డిమాండ్ చేస్తున్నాను. గతంలో తెలంగాణ కోసం పోరాడినట్టే ఇప్పుడు బలహీన వర్గాల కోసం కొట్లాడుతున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.
కొమురెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ నియామకం, గొర్ల స్కీమ్, ఫంక్షన్ హాల్ నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ‛‛స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుమలకు అవకాశం కల్పిస్తాం. బీసీలంతా ఐక్యంగా ఉంటేనే విజయం సాధిస్తాం" అని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దొడ్డి కొమురయ్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, కులపరమైన అంశాల్లో మంత్రిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. "మన సమస్యలు పరిష్కరించుకోవడానికి దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, కొమురం భీం వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో మీరంతా ధైర్యంగా పోరాడాలి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఎప్పటికీ అందుబాటులో ఉంటాను" అని మంత్రి హామీ ఇచ్చారు.