16 April, 2026 | 1:40 PM

మోదీ కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానన్నారు: మంత్రి పొన్నం

03-04-2025 01:52 PM

మోదీ వీడియో.. ప్రెస్ మీట్‌లో వినిపించిన మంత్రి పొన్నం

దిల్లీలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. రద్దు చేయగలరా?

ఈడబ్ల్యూఎస్ లకు 10 శాతం రిజర్వేషన్లు మోదీ ఇవ్వలేదా?

హైదరాబాద్: బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో చట్టం చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ(Narendra Modi) కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. మోదీ వీడియోను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్లో వినిపించారు.

ఢిల్లీలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి.. రద్దు చేయగలరా?, టీడీపీతో పొత్తుకన్న బీజేపీ..ఏపీలో 4 శాతం రిజర్వేషన్లు తీసేస్తుందా? ముస్లింలో దూదేకులవారికి రిజర్వేషన్లు ఇప్పుడు కొత్తగా వచ్చాయా? అని ప్రశ్నించారు. ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservation) వస్తే.. తర్వత వాటి పంపకం ఉంటుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చిందని మంత్రి పొన్నం తెలిపారు. ఈడబ్ల్యూఎస్(Economically Weaker Section) లకు 10 శాతం రిజర్వేషన్లు మోదీ ఇవ్వలేదా? ఓసీల జనాభాయే 10-12 శాతం ఉంది.. వారికి 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాజకీయం వద్దని గతంలోనే విజ్జప్తి చేశానని మంత్రి స్పష్టం చేశారు.