ఒక మెట్టు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం
వచ్చే కేబినెట్ లో మైనార్టీకి అవకాశం
కులగణన చేయడానికి ఛాంపియన్ రాహుల్ గాంధే
న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తూ చట్టం చేసింది మా ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఢిల్లీలో మంత్రులు, పీసీసీ చీఫ్ గురువారంనాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.... బీజేపీ.. మతం పేరుతో ఓట్లు అడుగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కులగణన చేశామన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో ఒక మెట్టు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ(Telangana Cabinet expansion) అనేది ఏఐసీసీ పరిధిలోని అంశమన్న ఆయన గుజరాత్ లో బీసీ జాబితాలోని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. తమిళనాడు తరహాలోనే తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని అడుగుతున్నామని చెప్పారు.
వచ్చే కేబినెట్ లో మైనార్టీకి అవకాశముంటుందని ఆయన స్పష్టం చేశారు. కులగణన చేయడానికి ఛాంపియన్ రాహుల్ గాంధే(Rahul Gandhi ) అన్నారు. కంచ గచ్చిబౌలి భూములు.. ప్రభుత్వ భూములే.. హెచ్ సీయూ భూములని(Hyderabad Central University land row) అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిసర భూములను కాజేసిన ఘనత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబానిదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా, మూసీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు కలిశారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో చట్టం చేయడంపై ఢిల్లీలో సోనియా గాంధీ(Sonia Gandhi)ని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు.






