17 August, 2026 | 6:34 PM

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రమోద్‌కు మంత్రి శ్రీధర్ బాబు భరోసా

17-08-2026 06:03 PM

చికిత్స కోసం రూ.3.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

మంథని, మహాదేవపూర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద కుటుంబానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండగా నిలిచారు. మంథని నియోజకవర్గం మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన తాటిపెళ్లి ప్రమోద్ (తండ్రి రాజబాబు) వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

ప్రమోద్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. స్పందించిన మంత్రి వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3,50,000 ఎల్‌ఓసీ మంజూరు చేయించి వైద్య చికిత్సకు భరోసా కల్పించారు.

మంత్రికి చెందిన ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి శ్రీధర్ బాబుకు ప్రమోద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంత్రి శ్రీధర్ బాబు అందిస్తున్న సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు.