calender_icon.png 28 June, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి

28-06-2025 01:22:04 PM

  1. అభివృద్ధి పనులలో భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తాం
  2. పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన
  3. మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కోరారు. శనివారం  మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  తో కలిసి  విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మంథని ప్రాంతంలో మౌలిక సదుపాయాల పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం, రోడ్లు భవనాల శాఖ మంత్రి  సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. గోదావరి నదిపై మంథని నుంచి శివారం వరకు 125 కోట్లతో చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు,162 కోట్ల రూపాయలతో మంథని పట్టణానికి 9.4 కిలోమీటర్ల మేర 4 లైన్ రింగ్ రోడ్డు పనులకు, 22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు.

హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, రింగ్ రోడ్డు లో భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హై లెవెల్ బ్రిడ్జి, రింగ్ రోడ్డు వల్ల మంథని, మంచిర్యాల, చెన్నూరు, మహారాష్ట్ర రాకపోకల పెరుగుతాయని సూచించారు. హై లెవెల్ బ్రిడ్జి వల్ల వాణిజ్యం పెరుగుతుందని, దీని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంథని పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడేలా అన్ని హక్కులతో నూతన ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. న్యాయవాదుల కోరిక మేరకు మందిని పట్టణంలో జ్యుడీషియల్ క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. మంథని ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసి పరిశ్రమలు ఆకర్షించి స్థానికంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అభివృద్ధి పనులకు అవరోధాలు సృష్టించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. సురేష్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.