21-08-2025 02:57:18 PM
ఇందిరమ్మ రాజ్యంలో తీరిన పేదల సొంతింటి కల
ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ,ఆగస్టు 21 (విజయక్రాంతి): పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ( Congress government) ధ్యేయం అని ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం వలిగొండ మండలంలోని నాతాళ్ల గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి(MLA Anil Kumar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం పేదలకు సుపరిపాలన అందించడంలో విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సుపరిపాలన అందిస్తుందని అన్నారు.
అందులో భాగంగానే పేదవారికి ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి అందిస్తుందని అన్నారు. పేదవారి సంక్షేమాన్ని ,అభివృద్ధిని కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎల్లప్పుడూ ఆదరించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసిన జూకంటి మనోహర లింగస్వామి దంపతులకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి నూతన వస్త్రాలను కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, ఉలిపే మల్లేశం, ఉద్ధగిరి భాస్కర్, బాలరాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.