21-08-2025 02:26:26 PM
హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. నిషేధిత సిపిఐ (Communist Party of India) కు చెందిన ఇద్దరు సీనియర్ అండర్‌గ్రౌండ్ నాయకులు సంవత్సరాల తరబడి అండర్‌గ్రౌండ్ కార్యకలాపాల తర్వాత గురువారం తెలంగాణలోని రాచకొండ పోలీసుల ముందు లొంగిపోయారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకే ఎస్‌జెడ్‌సీ) రాష్ట్ర కమిటీ సీనియర్ సభ్యురాలు కాకరాల సునీత(Maoist leaders Sunitha ) అలియాస్ బద్రి, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏరియా కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్ అలియాస్ రామన్న రాచకొండ పోలీస్ కమిషనర్(Rachakonda Police Commissioner ) జి. సుధీర్‌బాబు ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ చర్యలు, పునరావాస పథకాలతో ప్రభావితమైన నేతలిద్దరూ తమ కుటుంబాలతో ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్(Central Maoist Committee member Sudhakar) భార్య అయిన సునీత మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మావోయిస్టు పత్రిక జంగ్ క్రాంతికి ఎడిటర్‌గా సునీత పని చేశారు. శాంతి చర్చల ప్రక్రియలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఐదు ప్రధాన ఎన్‌కౌంటర్లలో సునీత పాలుపంచుకున్నారు. ఆమె తండ్రి, ఒక విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. వరవరరావు, గద్దర్ లాంటి విప్లవకారులు వారి ఇంటికి రావడంతో సునీత వారి వైపు మొగ్గు చూపారు. 1986లో పీపుల్స్ వార్ పార్టీలో కాకరాల సునీత ఉన్నారు. 1986 ఆగస్టులో ఆమె టీఎల్ఎన్ చలం గౌతమ్@ సుధాకర్ ను వివాహం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్ గా పనిచేసిన కాకరాల సునీత 1992లో నల్లమల అడువుల్లోకి వెళ్లారు. 2001లో ఏవోబీ ప్రాంతానికి, 2006లో దండకారణ్యానికి బదిలీ అయ్యారు.