21-08-2025 02:54:00 PM
సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ పిలుపు
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్(Mind Care and Counseling Center), ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో సుందరయ్య నగర్‌లోని పవర్ లూమ్ కార్మికులకు మనోవికాస సదస్సును ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నం చందర్ నిర్వహించారు. కార్మికులతో మానసిక ఆరోగ్యం, జీవనశైలి, నిద్ర ప్రాముఖ్యతపై చర్చించారు. ఈ సందర్భంగా పున్నం చందర్ మాట్లాడుతూ, పవర్ లూమ్ కార్మికులు రోజువారీ కష్టమైన శారీరక శ్రమ, అనిశ్చితమైన జీవనశైలి కారణంగా నిద్రలేమితో బాధపడుతున్నారని అన్నారు. దీని వల్ల ఆందోళన, డిప్రెషన్, శారీరక అలసట, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.నిద్ర సమస్యలు నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
అని కార్మికులకు వివరించారు.నిద్రలేమి వల్ల కలిగే ఇబ్బందులను గురించి తెలుపుతూ శారీరక అలసట, పనితీరు తగ్గిపోవడం, మానసిక ఆందోళన, చిరాకు పెరగుతుందని అన్నారు. దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నారు. కుటుంబ సంబంధాలు, సామాజిక జీవనశైలిపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. నిద్ర సమస్యలను అధిగమించేందుకు పాటించవలసిన జాగ్రత్తలను గురించి వివరిస్తు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం చేయాలన్నారు.నిద్రకు ముందు మొబైల్, టీవీ వాడకాన్ని తగ్గించాలని కార్మికులకు సూచించారు.
ఆధ్యాత్మిక అలవర్చుకోవడం, శ్వాస వ్యాయామాలు చేయాలని తెలిపారు.కాఫీ, టీ, మద్యం వంటి పదార్థాలను రాత్రి సమయాల్లో నివారించాలని కోరారు.మంచి నిద్ర అనేది మంచి ఆరోగ్యానికి పునాది. క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే కార్మికులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అని కార్మికులను ప్రోత్సహించారు.మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలుపుతూ ఆందోళన, ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలింగ్ సహాయం కోసం రావాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ,బూర రాపెల్లి లత కార్మికులు పాల్గొన్నారు.