22 June, 2026 | 3:20 AM

పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణమే లక్ష్యం

22-06-2026 01:51 AM

ఉమ్మడి జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

దమ్మపేట, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.దమ్మపేట మండల పరిధిలోని మల్కారం, గుత్తావారిగూడెం గ్రామాల పామాయిల్ రైతులు ఏర్పాటు చేసిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మలను వేదిక వద్దకు గిరిజన సాంప్రదాయ నృత్యమైన కొమ్మునృత్యంతో పూలు చల్లుతూ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు పామాయిల్ రైతులు మాట్లాడుతూ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాలకు పామాయిల్ పంటను పరిచయం చేశారని పదవిలో వున్నా కూడా ఇంటికి వస్తే సామాన్య రైతుగా వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతారన్నారు. రైతుల సాధకబాధలు తెలిసిన తుమ్మల వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేయడం మనం ఏనాడో చేసుకున్న పుణ్యమన్నారు.   

దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఎన్నో చెక్ డ్యామ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించారని, ఈ ప్రాంతంలో తారురోడ్డు లేని గ్రామమే లేదన్నారు.. ప్రజా సేవలో పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిరంతరం ప్రజలకోసం పాటుపడే మనస్తత్వం అన్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు దీవెనలతో సత్తుపల్లి ప్రాంత ప్రజలు నాకు రాజకీయ అవకాశం కల్పించారని, రాజకీయం అంటే ప్రజా సేవలోనే నలభై ఏళ్ళు గా వున్నానని, నేను ఏ పార్టీలో వున్నా, ఏ నియోజకవర్గంలో వున్నా అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం పామాయిల్ సాగుతో సస్యశ్యామలంగా, పచ్చగా వుండాలని, పది లక్షల ఎకరాల్లో మామాయిల్ సాగు విస్తీర్ణం లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు.

పామాయిల్ అంతర పంటలుగా కోకో, జాజి, వక్క సాగుతో అదనపు లాభం చేకూరుతుందన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేపడుతున్నామని, దమ్మపేట, అశ్వారావుపేట పామాయిల్ తోటలు చూస్తూ మలేషియా మాదిరి కనువిందు చేస్తున్నాయన్నారు. సి.యం. రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని పామాయిల్ హబ్ గా మారుస్తామన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఆయిల్పామ్ రైతు సంఘ అద్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, మాజీ జెడ్.పి.టి.సి. పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం వాణి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పామ్ ఆయిల్ రైతులు పాల్గొన్నారు.