21-09-2025 02:27:41 PM
-కృష్ణానది జలాల పంపిణి లో న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదు
-గత పాలకులు కృష్ణా నది జలాల పంపకంలో పదేళ్ల నిర్లక్ష్యం
-గత పాలకులు లక్ష కోట్లతో కాళేశ్వరం పేరుతో 3బ్యారేజ్ లు నిర్మిస్తే మూడేళ్ళకే కూలిపోయింది.
-రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్
హుజూర్ నగర్,(పాలకీడు): ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ డ్యామ్ విషయంలో తెలంగాణకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండల పరిధిలో జాన్ పహడ్ గ్రామంలో కృష్ణానదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్ పహడ్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కెప్టెన్ ఉత్తమ్ మాట్లాడుతూ... కృష్ణా నది జలాల పంపకంలో గత పాలకులు పదేళ్ల నిర్లక్ష్యం చేయటంతో కృష్ణా నదిలో 811 టీఎంసీలలో ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణాకి 299 టీఎంసీలకి వ్రాత పూర్వకంగా ఒప్పుకున్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక నదీ పరివాహక ప్రాంతం ఆయకట్టు, జనాభాను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ ప్రకారం తెలంగాణకు 70 శాతం జలాలు కేటాయించాలని పోరాడుతు న్నామని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించామన్నారు. మరోసారి ఢిల్లీ వెళ్లి తెలంగాణాకు న్యాయం జరిగేలా వాదనలు వినిపిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు.
అందుకు కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు.గత పాలకులు లక్ష కోట్లతో కాళేశ్వరం పేరుతో 3 బ్యారేజ్ లు నిర్మిస్తే మూడేళ్ళకే కూలిపోయిందన్నారు.యన్ డి ఎస్ఎ నివేదిక ప్రకారం బ్యారేజ్ పునరుద్దరణ పనులు చేసేందుకు ముందుకు వెళ్తామని వెల్లడించారు.ఈ ప్రాంతం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 7 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని ,ఈ ప్రాంత ప్రజలు చూయించే ప్రేమానురాగాలకు కృతజ్ఞతగా ఉంటాన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ,మహిళల జీవితాలను మెరుగుపడేందుకు 24 గంటలు కృషి చేస్తున్నానని తెలిపారు.కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధిపై ప్రతిరోజు ఒక గంట సమీక్ష నిర్వహించేలా దినచర్య ఉంటుందని తెలిపారు.
జవహర్ జాన్ పహాడ్ లిప్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జాన్ పహాడ్ లిప్ట్ ఇరిగేషన్ స్కీం ను 302 కోట్ల రూపాయలతో నిర్మించటం జరుగుతున్నదన్నారు. లిఫ్ట్ ద్వారా అలింగాపురం, రాఘవపురం, బొత్తలపాలెం, కోమటి కుంట, మీగడంపాడు తండా, చెరువు తండా, హనుమాయ గూడెం, పాలకీడు, సజ్జాపురం,నాగిరెడ్డి గూడెం గ్రామాలలోని 10 వేల ఎకరాలకి సాగునీరు అలాగే జాన్ పహాడ్ చెరువుకు నీరు అందించటం జరుగుతుందని తెలిపారు.
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో రైతులకు న్యాయం జరిగేలా పూర్తి చేయాలని ఆర్డీఓ ను ఆదేశించారు.డిసెంబర్ చివరి నాటికి జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే పదివేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈయన్ సి రమేష్ బాబు,జిల్లా ఎస్పి నరసింహ,ఆర్డివో శ్రీనివాసులు,ఇరిగేషన్ ఎస్ఈ నాగభూషణం, మాజీ ఎంపీపీ భూక్య గోపాల్, మోతిలాల్,సుబ్బారావు, తదితరులు,పాల్గొన్నారు.