21-09-2025 04:34:02 PM
కారు పక్కకు తీయమన్నందుకు దురుసు ప్రవర్తన..
కుడిచేతి చూపుడువేలకి గాయం..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): వాహనాన్ని ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పక్కకు తీయమని చెప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కారు యజమాని దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఓ వ్యక్తి తన కారును రోడ్డుకు అడ్డంగా నిలిపి ఉంచడంతో దానిని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండి ఫైజల్ కారును పక్కకు తీయాలని యజమానికి చెప్పాడు. దీంతో విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ పరుష పదజాలంతో దూషించే క్రమంలో కారు తాళం చెవి ట్రాఫిక్ కానిస్టేబుల్ కుడిచేతి చూపుడువేలకి తగలడంతో భారీగా రక్తస్రావం జరిగింది. దీంతో తోటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఇతర స్థానికులు గమనించి ఎంతగా వారించినా వినకుండా హంగామా సృష్టించాడు.