calender_icon.png 22 November, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం ప్రాజెక్టపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్

26-07-2024 04:48:58 PM

బ్యారేజీ కుంగినా కేసీఆర్ నోరు మెదపలేదు

ఎన్డీఎస్ఏ నివేదికపైనా బీఆర్ఎస్ ఆరోపణలు

హైదరాబాద్: కాగ్ లెక్కల ప్రకారం కాళేశ్వరం పూర్తి కావాలంటే రూ.1.47 లక్షల కోట్లు కావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జలసౌధలో మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కమీషన్ల కక్కుర్తి కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపేశారని ఆరోపించారు. కాళేశ్వరం వ్యయం రూ. 38,500 కోట్ల నుంచి రూ. 80 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను పూర్తిస్థాయిలో రన్ చేస్తే కరెంట్ బిల్లే రూ. 10 వేల కోట్లు అవుతూందని మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో రుణాలు తీసుకున్నారని లెక్క చెప్పారు. ఏడాదికి కాళేశ్వరంపై రూ. 15 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. కాళేశ్వరం పూర్తయ్యి అన్ని మోటార్లు రన్ చేస్తే వ్యయం ఇంకా పెరుగుతోందన్నారు. 93 వేల ఎకరాల ఆయకట్టు కోసం రూ. 94 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ పై రూ. 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర చేసిందని బీఆర్ఎస్ ఆరోపించడం విడ్డూరం అన్నారు. మేడిగడ్డ మొదలుపెట్టినప్పుడు, కూలినప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని సూచించారు. మేడిగడ్డలో పిల్లర్లు 6 అడుగులు లోపలికి కుంగాయని ఆరోపించారు. నాసిరకంగా నిర్మించడం వల్లే బ్యారేజీ కుంగినట్లు ఎన్డీఎస్ఏ తెలిపిందని, కానీ ఎన్డీఎస్ఏ నివేదికపైనా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కేంద్రం చట్టం ద్వారా ఏర్పాటు చేశారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అక్టోబర్ 21న బ్యారేజీ కుంగింది.. తమ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ లో అని మంత్రి గుర్తుచేశారు. మేడిగడ్డ వద్ద ఎవరో బాంబులు పెట్టినట్లు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారని మండిపడ్డారు. బ్యారేజీ కుంగినా కేసీఆర్ నోరు మెదపలేదని ఉత్తమ్ విమర్శించారు.