23 July, 2026 | 10:42 AM

మట్టి కరిచిన మహామహులు!

06-06-2024 12:32 AM

కేంద్ర మంత్రులకూ  తప్పని ఓటమి

కీలక స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ, జూన్ 5 : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పలు కీలక స్థానాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌డీఏ కూటమి మెజార్టీ సాధించినప్పటికీ.. చాలా స్థానాల్లో బీజేపీ అగ్రనేతలు ఓటమిపాలయ్యారు. ముఖ్యంగా మోదీ కేబినెట్‌లో కీలక పదవుల్లో మంత్రులుగా కొనసాగిన స్మృతి ఇరానీ, అర్జున్ ముండా, అజర్ మిశ్రా తేనీ, రాజీవ్ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖ నేతలు ఓటమి చవిచూశారు. 

ఓడిపోయిన మంత్రులు వీరే..

స్మృతి ఇరానీ

అమేథీ నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గత ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించి అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేశారు. కానీ, ఈ సారి ఆమె ఎత్తుగడలు పారలేదు. కాంగ్రెస్ నేత కిశోరీ లాల్ శర్మ చేతిలో ఓడిపోయారు.

అజయ్ మిశ్రా తేనీ

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఉత్కర్ష్ వర్మ చేతిలో ఓటమిపాలయ్యారు.

అర్జున్ ముండా

జార్ఖండ్‌లోని ఖుంటి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండా చేతిలో కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా 1,49,675 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

కైలాష్ చౌదరి

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కైలాశ్ చౌదరీ రాజస్థాన్‌లోని బార్మర్ నియోజకవర్గం నుంచి 4.48 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఉమ్మెడ రామ్ బెనివాల్ చేతిలో 4.48 లక్షల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

రాజీవ్ చంద్రశేఖర్

కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీచేసిన ఎలక్ట్రానిక్, ఐటీ సహాయ మంత్రిగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ దిగ్గజం శశిథరూర్ చేతిలో 16 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

మహేంద్ర నాథ్ పాండే

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే యూపీలోని చండౌలీ స్థానం నుంచి పోటీచేశారు. ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థి కౌశల్ కిషోర్ చేతిలో 70,292 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

సాధ్వీ నిరంజన్

యూపీలోని ఫతేపూర్ స్థానం నుంచి పోటీ చేసిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖా సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ ఓడిపోయారు. 

సంజీవ్ బాల్యన్

కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ ముజఫర్‌నగర్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి ప్రత్యర్థి ఎస్పీ నేత హరీంద్ర సింగ్ మాలిక్ చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.