మిషన్ భగీరథ నీళ్ల కష్టాలు తీర్చాలి
అలంపూర్, మార్చి 27: గద్వాల జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా కుళాయిలకు అందించే త్రా గునీరు రాక ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బీసీ సంఘ నాయకులు శింగవరం 1 గ్రామ సర్పంచ్ గొంగళ్ల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వరుసగా ఉగాది, రంజాన్ ఈరోజు జరుపుకున్న శ్రీరామనవమి వంటి పండుగలకు చుక్క నీళ్లు రాక ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. అధికారులు కనీసం ప్రజలకు త్రాగునీరు అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్లు మండిపడ్డారు.
ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన మంచి నీటిని అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నీళ్లు రాని దుస్థితి ఏర్పడిందన్నారు.వెంటనే జిల్లా ఉన్నత అధికారులు ప్రజలకు అందించే తాగునీరు విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క నీటి అవసరతను గుర్తించి సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని అన్నారు.




