28 March, 2026 | 2:31 AM

రమణీయం.. రాములోరి కల్యాణం

28-03-2026 12:16 AM

వెంకటాపూర్, మార్చి 27(విజయక్రాంతి): శ్రీరామనవమిని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా సీతారామచంద్ర స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు.  కల్యాణ మహోత్సవం పలు ఆలయాల్లో మజ్జిగ, చల్లటి మంచినీరు, వివిధ ప్రసాదాల వితరణ, అన్నదానాలు చేశారు. వెంకటాపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ నరెడ్ల భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివార్లకు పట్టు వస్త్రాలను పలువురు సమర్పించగా మంగళసూత్రంను ఆలయ కమిటీలు సమర్పించారు. పలు రకాలు పుష్పాలతో సీతమ్మను, శ్రీరామ చంద్రుడిని అందంగా అలంకరించారు. 

 సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్త్స్ర చల్లా రాజు దంపతులు హాజరై కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా అన్న వితరణ దాత తంగళ్ళపల్లి దేవరాజు గౌతమి దంపతులు కలిసి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారి విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద నుంచి ట్రాక్టర్లో ఉంచి ఊరేగింపుగా మందిరానికి తీసుకొచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన 

మంగపేట, మార్చి 27 ( విజయక్రాంతి ) :   కమలాపురంలో శ్రీ సీతారామ చంద్ర దేవస్థానంలో జరిగిన సీతారాముల కల్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో భక్తి గీతాలకు అనుగుణంగా కోలాటం ప్రదర్శించారు.  

భీమదేవరపల్లిలో..

భీమదేవరపల్లి, మార్చి27 (విజయక్రాంతి):  హనుమకొండ  భీమదేవరపల్లి మండలంలోని కొప్పూరు గ్రామ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉత్సవమూర్తులచే శ్రీరాముడు సీతాదేవి కళ్యాణ వేడుకలను ఆలయ వ్యవస్థాపకులు కాసం రమేష్ గుప్తా ఆలయ అర్చకులు ఉపేందర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్నదానం నిర్వహించారు. భీమదేవరపల్లిలో సర్పంచ్ మాచర్ల కుమారస్వామి ఆధ్వర్యంలో కల్యాణం, అన్నదానం నిర్వహించారు.  సాంబమూర్తి ఆలయంలో చైర్మన్ గన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అయ్యప్ప స్వామి ఆలయం వద్ద కాస గోని భగత్ సింగ్ ఆధ్వర్యంలో కళ్యాణం, అన్నదానం  ఏర్పాటు చేశారు.