12-11-2025 10:29:55 PM
దేశంలో అతిపెద్ద రిటైల్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ చెరువుల రూపురేఖలు మార్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. తమ తన ప్రధాన ఈఎస్జీ కార్యక్రమం 'లేక్స్ ఆఫ్ హ్యాపినెస్' కింద 10వ చెరువు అయిన మియాపూర్ గురునాథ్ చెరువుకు కొత్త శోభను తీసుకొచ్చింది. ఈ చెరువు పునరుద్ధరణను విజయవంతంగా పూర్తి చేసి స్థానికులకు అప్పగించింది. ఈ కార్యక్రమానికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాకు ప్రసిద్ధి చెందిన డా. ఆనంద్ మల్లిగావద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈఓ దలీప్ సేఘల్ మాట్లాడుతూ 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న నీటి వనరులను సామూహిక భాగస్వామ్యంతో పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
2026 ఆర్థిక సంవత్సరంలోపు 15 చెరువులను దత్తత తీసుకుని పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 10 చెరువులు పునరుద్ధరించామని చెప్పారు. నీటి కొరత అనేది కేవలం పర్యావరణ సమస్య కాదని, అది మానవ సమస్య కూడా మారిందని చెప్పుకొచ్చారు. పునరుద్ధరించిన ప్రతి చెరువు మళ్లీ తన సమాజానికి ఉపయోగకరంగా మారిందని నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ జయేన్ నాయిక్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం భూగర్భ జలాలను పునరుద్ధరించడం, పక్షులను ఆకర్షించడం, పంటల ఉత్పత్తిని మెరుగుపరచడం, ప్రజలను ప్రకృతితో మళ్లీ అనుసంధానం చేయడం వంటి అద్భుత ఫలితాలను ఇస్తుందన్నారు. ఈ సందర్ఙంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అభినందించారు.