ఫొటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్‌కు ప్లాట్ ఇచ్చిన ఎమ్మెల్యే
కామారెడ్డి, ఆగస్టు 19 (విజయక్రాంతి): గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ యూనియన్ కి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారని, వాటి ప్రతులను అందజేసినట్లు బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ గుప్తా తెలిపారు. బుధవారం కామారెడ్డి మెహర్ బాబా కళ్యాణ మండపంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా కామారెడ్డి పట్టణ ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టిగా సంఘం ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా అనేక కుల సంఘాలకు, యూనియన్లకు తన సొంత డబ్బులతో ఎమ్మెల్యే పనులు చేయిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం ఉన్న ఎమ్మెల్యే సహకారం, మద్దతు ఉంటుందని శ్రీకాంత్ గుప్త తెలిపారు. మహిళా ఫోటోగ్రాఫర్లను, ఫోటో వీడియో గ్రాఫర్ల ప్రతినిధులను సన్మానించారు. ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.






