ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం మనందరి బాధ్యత
కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం మనందరి బాధ్యత అని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ కి సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోందన్నారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.
అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పాల్గొన్నారు.






