ప్రభుత్వ ఆసుపత్రి కరెంటు కష్టాలపై ఎమ్మెల్యే జీఎంఆర్ సీరియస్
విద్యుత్ సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపై ఆగ్రహం
జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
తక్షణమే 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
పటాన్చెరు, ఆగస్టు 11 (విజయక్రాంతి): పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ సమస్యలు తలెత్తి రోగులు ఇబ్బందులు పడుతున్న ఘటనపై పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రి ఆర్‌ఎంఓ శ్రీనివాస్, వైద్యులు, ఆసుపత్రి అభివృద్ధి సలహా సంఘం సభ్యులతో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు జనరేటర్ పనిచేయకపోవడం వల్ల రోగులు, వారి సహాయకులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆయన అధికారులను ఆరా తీశారు.
ఆసుపత్రిలో విద్యుత్ సమస్య తలెత్తినా, జనరేటర్ పనిచేయకపోయినా ఈ విషయం నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? అంటూ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించే సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడటం, ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన జనరేటర్ కూడా పనిచేయకపోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రి మొత్తం విద్యుత్ వైరింగ్ను మార్చేందుకు సుమారు రూ.4 లక్షలు అవసరమవుతాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు ఫోన్ చేసి ఆసుపత్రి వైరింగ్ పనుల కోసం అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభించి, ఆసుపత్రిలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం, నాణ్యమైన మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.






