3 July, 2026 | 1:49 AM

ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్య బలోపేతమే లక్ష్యం

03-07-2026 12:59 AM

మంత్రి సీతక్కతో భేటీ అయిన ఎమ్మెల్యే జారే

దమ్మపేట, జూలై 2 (విజయక్రాంతి): గ్రామీణ అభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కను వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (PETA TS)అధ్యక్షులు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్య బలోపేతం, ఖాళీల భర్తీపై మంత్రి సీతక్క తో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1803 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల (PET) పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును, శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ వినతిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల అభ్యున్నతికి, వికాసానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పేటా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి గౌడ్, సంఘ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.