3 July, 2026 | 1:48 AM

ఆయిల్‌ఫామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలి

03-07-2026 12:57 AM

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఇతర పంటల కంటే రైతులకు పామాయిలు పంట ఆదాయం ఎక్కువ

చిన్న, సన్నకారు రైతులకు అన్ని విధాలా అండగా ప్రభుత్వం

ఖమ్మం, ఏన్కూర్ జూలై 2 (విజయక్రాంతి): వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకమైన పంటగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు.

గురువారం ఏన్కూర్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ గార్ల ఒడ్డు గ్రామానికి చెందిన రైతు కాటా హరినాథ్బాబు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను సందర్శించారు. వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ ఆయిల్పామ్ మొక్కల పెరుగుదల, బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), అంతర పంటల సాగు, మొక్కల సంరక్షణ, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రైతుతో మాట్లాడిన కలెక్టర్ పంట సాగు విధానం, పెట్టుబడి వ్యయం, ప్రభుత్వ సబ్సిడీలు, దిగుబడి, మార్కెటింగ్, రైతులకు లభిస్తున్న ధరలు, అంతర పంటల ద్వారా వస్తున్న అదనపు ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతుల అనుభవాలు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తాయని ప్రశంసించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఆయిల్పామ్ పంటకు ప్రారంభ దశలో ప్రభుత్వం మొక్కలు, డ్రిప్ సబ్సిడీ రూపంలో సహకారం అందిస్తోందని, పంట దిగుబడి వచ్చిన తర్వాత రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఇతర సంప్రదాయ పంటలతో పోలిస్తే సాగు ఖర్చులు తక్కువగా ఉండటంతో పాటు లాభాలు అధికంగా ఉంటాయని చెప్పారు.

ఆయిల్పామ్ పంటపై ఆకాల వర్షాలు, రాళ్ల వానలు, చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుందని, కోతులు, అడవి పందుల వంటి జంతువుల వల్ల కూడా పెద్దగా నష్టం ఉండదని వివరించారు. మందుల వినియోగం, నిర్వహణ వ్యయం కూడా ఇతర పంటలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.