14 August, 2026 | 2:32 AM

పాఠశాల, అంగన్‌వాడీ, ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జారే

14-08-2026 12:00 AM

దమ్మపేట, ఆగస్టు 13,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో నేను సైతం చేయూత కార్యక్రమంలో భాగంగా విద్యా యాత్ర మన ఎంఎల్ ఏ - మన బడి అనే నూతన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా ఎం పి పి ఎస్ కొమ్ముగూడెం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, తరగతి గదుల నిర్వహణను పరిశీలించారు.

పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీటి సదుపాయం, వంటశాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను నిశితంగా తనిఖీ చేశారు. అనంతరం కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి స్థానిక పాలన, గ్రామాభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు.

అనంతరం దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఇన్-పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవల అందుబాటుపై ఆరా తీశారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వానికి ముఖ్యమని, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులలో నాణ్యమైన సేవలు అందించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.