20-01-2026 12:13:55 AM
పాల్వంచ, జనవరి 19 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో బీజేపీ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. 44వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేయబోతున్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం శ్రీనగర్ కాలనీలోని తన స్వగృహం నుండి గాంధీనగర్ వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 44వ డివిజన్లో ప్రజల నుండి బీజేపీకి అనూహ్యమైన స్పందన లభిస్తోందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆదరిస్తున్నారన్నారు.
అభివృద్ధి అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే అభివృద్ధి అని ప్రజలు విశ్వసిస్తున్నార న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ నినాదంతో దేశ ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ, భారత్ను ప్రపంచంలోనే అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చేస్తున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. పాల్వంచ పట్టణంలో గత సుమారు 27 సంవత్సరాలుగా మున్సిపల్ ఎన్నికలు లేకపోయినా, ఎన్నికలు ఉన్నా లేకున్నా మున్సిపల్ పరిధిలోని అనేక ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన చరిత్ర తమదన్నారు. అందుకే ప్రచారంలో ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తూ, ఆశీర్వదిస్తున్నారన్నారు.
పాల్వంచ మున్సిపల్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేని ప్రాంతాలు, పారిశుధ్య లోపం ఉన్న ప్రాంతాల్లో గత పది సంవత్సరాలుగా మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, పారిశుధ్య పనులు చేయించి నందుకు ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఆశీర్వదిస్తున్నారన్నారు. 44వ డివిజన్లో బీజేపీ జెండా ఎగరటం ఖాయం అని పొనిశెట్టి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుడగం రవి కుమార్, గార్లపాటి కిరణ్, ఆగారెడ్డి రాంరెడ్డి , డి కిన్నెర శ్రీను, కొత్తపల్లి విజయ్, బొల్లెపోగు నాగేశ్వరావు, బాబు, అశోక్, ప్రశాంత్,లక్ష్మణ్, సంతపల్లి శేఖర్, బాలాజీ నాయక్, వరలక్ష్, సునీత, రమణ, లక్ష్మి, మంగ తదితరులు పాల్గొన్నారు.