18-07-2025 07:06:53 PM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): పేదవారి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో హన్మకొండ అంబేడ్కర్ భవన్ నందు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 1, 2, 3, 43, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్లలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సుమారు 137 మందికి మంజూరు పత్రాలను నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి అందజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. తొలుత ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కాజీపేట మండల పరిధిలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 36 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 22వేల 500కోట్లతో 4లక్షల 50వెల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో 175 కోట్ల రూపాయలతో 3 వేల 500 ఇండ్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా, అత్యంత పారదర్శకంగా జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం 20వేల దరఖాస్తులు వస్తే 8వేల మందిని అర్హులుగా గుర్తించారాని తెలిపారు. అయితే అందరికీ ఒకేసారి ఇల్లు రావని, మొదటి విడతలో రాని వాళ్లకు రెండవ విడతలో అవకాశం వస్తుందని వివరించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధైర్యపడవద్దని అర్హులైన వారికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత సన్న బియ్యం, సన్నాలకు క్వింటాకు 500 బోనస్, 21 వేల కోట్లు రుణమాఫీ, రైతు భరోసా, మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ప్రభుత్వమే ఇసుక పాలసీనీ తీసుకు వచ్చి లబ్ధిదారులకు కేవలం రవాణా ఖర్చులతో అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. అలాగే మీకు ఏ సమస్య ఉన్న నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 కి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేసే త్వరితగతన మీ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అన్నారు.