03-07-2025 12:29:08 AM
వారసిగూడ, జూలై 2 (విజయక్రాంతి) : అభివృద్ధి పధంలో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో బుధవారం సుమారు రూ.75 లక్షల విలువజేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు.
చిలకలగుడా లోని వెంకటేశ్వర నగర్ లో రూ.25 లక్షలు, మార్కండేయ నగర్‌లో రూ.28 లక్షలతో రోడ్డు నిర్మాణం పనులు, సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో రూ.14 లక్షల ఖర్చుతో మరమ్మతు పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్బంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షా కాలంలో ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అధికారులు నిర్లక్షంగా వ్యవహరించరాదని సూచించారు.
అధికార యంత్రాంగం వర్షాకాలంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక కార్పొరేటర్ లతో సమన్వయo ఏర్పరుచుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. బీఆర్‌ఎస్ యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, అధికారులు స్వర్ణ లతా, కౌశిక్ లతో పాటి వివిధ విభాగాల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.