calender_icon.png 7 July, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి తల్లి ఇంట్లో రెండు చెట్లు పెంచాలి: సీఎం

07-07-2025 10:17:06 AM

వనం పెంచితేనే మనం బాగుంటాం

హైదరాబాద్: రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం నాడు మొక్కలు నాటి వన మహోత్సవం(Vana Mahotsavam) కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి రుద్రాక్ష మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పీసీసీఎఫ్ సువర్ణ పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...  తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్లే జాగ్రత్తగా చూసుకుంటారని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో తలో రెండు చెట్లు పెంచాలని సీఎం(Revanth Reddy) పిలుపునిచ్చారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలమని రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలు కూడా తమ తల్లుల పేరు మీదగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామన్నారు.

పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మహిళల చేత ఇందిరా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు. మహిళ సంఘాల చేత బస్సులు కొనుగోలు చేయించి.. ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది మహిళలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఒకప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్టులు అంబానీ, అదానీ వంటివారే ఏర్పాటు చేసేవారన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మహిళలు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూసిందని సీఎం ఆరోపించారు. ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదని విమర్శించారు. రాజీవ్ గాంధీ తెచ్చి మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్లే మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని వివరించారు. భవిష్యత్తులో మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.