03-07-2025 12:28:07 AM
రూ.27 కోట్లతో 184 గోడౌన్స్ నిర్మాణం
ఒక్కో దానికి రూ.15 లక్షల ఖర్చు
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణలోని మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో వారికి అన్ని అంశాల్లోనూ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక పథకాలను, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాట్లు, ఇందిరా మహిళా శక్తి పేరుతో జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక భవనాలు, మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక బస్సుల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను మహిళల కో సం అమలు చేస్తుంది. తద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నది.
మహిళలకు సాధికారత కల్పించ డంలో భాగంగా ఇప్పటివరకు చేపడుతున్నట్టుగానే మరో కొత్త కార్యక్రమానికి ప్రభు త్వం శ్రీకారం చుడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మినీ గోదాముల నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.15 లక్షలను ప్రభుత్వం కేటాయిస్తున్నది. గోదాముల నిర్మాణానికి కావాల్సిన నిధులను సెర్ప్ నుంచి సమకూర్చనున్నారు.
మహిళా రైతు సంఘాలు, మండల సమాఖ్యలకు బాధ్యతలు..
రైతులు ధాన్యం నిలువ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ మినీ గోదాముల ని ర్మాణాన్ని చేపడుతున్నది. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గోదాములకు సంబంధించిన అంచనాలను రూ పొందించింది. రాష్ర్ట వ్యాప్తంగా 184 మినీ గోదాములు నిర్మించాలని నిర్ణయించగా ఒక్కొక్క గోదాము నిర్మాణం కోసం రూ.15 లక్షలు కేటాయించింది.
గోదాముల నిర్వహణ బాధ్యతలను మహిళా రైతు సంఘా లు, మండల సమాఖ్యలకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. గోదాముల ని ర్మాణం కోసం మండలాల్లో అనువైన ప్రాం తాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించినట్లు తెలుస్తోంది.
ఒక్కొక్క గోదాములో ఎన్ని క్వింటాల ధాన్యం స్టోరేజీ చేయాలనే దానిపై నాబ్ కిసాన్ సంస్థ డీపీఆర్ రూపొందిస్తుంది. గోదాముల నిర్మాణ బాధ్యతలను నాబ్ కిసాన్‌కు అప్పగించారు. ఆయా మండ లాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వీలైనంత త్వరగా గోదాములు నిర్మించేందుకు సెర్ప్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
నిర్మాణానికి రూ. 27 కోట్లు
గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో సెర్ప్ ఆధ్వర్యంలో మినీ గోదాములను నిర్మిస్తున్నది. సెర్ప్ నిధుల నుంచే గోదాముల నిర్మానానికి నిధులు కేటాయిస్తున్నారు. రాష్ర్టంలో ఒక్కో గోదాం నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయిస్తున్నారు.
మొత్తం 184 గోదాముల నిర్మాణానికి రూ.27 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని సెర్ఫ్ అధికారులు అంచనా వేశారు. 184 గోదాముల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 84 గోదాముల నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 100 గోదాముల బాధ్యతలను మండల సమాఖ్యలకు అప్పగించనున్నారు.
ఈ గోదాముల ద్వారా రైతుల ధాన్యాన్ని నిల్వ చేయడం, దాని నాణ్యతను కాపాడటం, మార్కెట్ ధరలకు అనుగుణంగా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కలుగనుంది. ఈ గోదాములతో మహిళల ఆర్థిక స్వావలంబన, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.