రైతుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎమ్మెల్యే పట్టుదలతో ఆహార ధాన్య నిల్వ భవనాల నిర్మాణానికి రూ.1.20 కోట్లు నిధులు మంజూరు
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రైతు సంతోషం నియోజకవర్గ అభివృద్ధి అనే నమ్మకంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి సంవత్సరం భారీ వర్షాల కారణంగా రైతులు పండించిన పంటలను సురక్షితంగా నిల్వ చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే , వెంటనే స్పందించి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆహార ధాన్య నిల్వ భవనాల నిర్మాణానికి ప్రత్యేకంగా ప్రయత్నించారు.
ఎమ్మెల్యే పట్టుదలతో రూ.1.20 కోట్లు నిధులు మంజూరు చేయించడంలో విజయవంతమయ్యారు. ఈ నిధులతో లింగంపేట మండలంలోని లింగంపేట, లింగంపల్లి ఖుర్ద్, శెట్పల్లి, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల్లో ప్రతి గ్రామానికి రూ.30 లక్షల వ్యయంతో ఆధునిక ధాన్య నిల్వ భవనాల నిర్మాణం చేపట్టబడనుంది. ఈ భవనాలు రైతులకు పంటలను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, వర్షాల వల్ల కలిగే నష్టాలను గణనీయంగా తగ్గించనున్నాయి. రైతుల సమస్యలను లోతుగా అర్థం చేసుకుని వేగంగా స్పందిస్తూ, శాశ్వత పరిష్కారాలు అందిస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ సేవలను రైతులు హర్షం వ్యక్తం చేస్తూ,ప్రజలు అభినందిస్తున్నారు.




