ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యం
ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్తకోట బాలికల పాఠశాల ప్రారంభం
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ
వనపర్తి, జూలై 13 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. జూలై 15న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొత్తకోటలో పర్యటించి నూతన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రూ.1.77 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు, దాతల సహకారంతో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని, రూ.33.50 లక్షల వ్యయంతో పీఎం శ్రీ పథకం కింద లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాలను నిర్మించి సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థినులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, అత్యాధునిక ల్యాబ్లు, డిజిటల్ ప్యానెల్ బోర్డులు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత బోధనను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.
అలాగే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. జూలై 15న ముఖ్యమంత్రి పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ విద్యలో అమలు చేస్తున్న సంస్కరణలపై చర్చించనున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని విద్యార్థులకే అంకితం చేస్తూ విద్యా అంశాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వీరారెడ్డి, జెడ్పీ సీఈవో యాదయ్య, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






