చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, ఆగస్టు 14 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. చందూరు మండలంలోని మేడిపల్లి తండా, లక్ష్మీ సాగర్ తండా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన తన చేతుల మీదుగా ప్రారంభించారు. మేడిపల్లి గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం మేడిపల్లి నుంచి లక్ష్మీ సాగర్ వరకు SౄF నిధులు రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే లక్ష్మీ సాగర్ నుంచి వ్యవసాయ పంట పొలాలకు వెళ్లేందుకు SౄF నిధులు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్డు, లో లెవెల్ వంతెనను కూడా ప్రారంభించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో చందూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






