అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కమిషనర్‌కు ఎమ్మెల్యే వినతి
కూకట్ పల్లి, ఆగస్టు 18, (విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైబరాబాద్ కమిషనర్ సృజనను కలిసి కోరారు.
మంగళవారం సిఎంసి కార్యాలయంలో సైబరాబాద్ కమిషనర్ సృజనను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి అసంపూర్ణంగా మిగిలి ఉన్న అభివృద్ధి పనుల పై చర్చించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కమిషనర్ ను కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ నిధుల కేటాయింపు విషయంలో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు అంశాలపై కమిషనర్ తో చర్చించినట్లు తెలిపారు.
మూసాపేట చౌరస్తా నుండి కైతల్లాపూర్ బ్రిడ్జి వరకు రోడ్డు అభివృద్ధి చేయాలని, కైతల్లాపూర్ రైల్వే అండర్ పాస్ పనులకు నిధులు కేటాయించి వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. ఫతేనగర్ నగర్ బ్రిడ్జి పనులను సత్వరమే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, బోయిన్ పల్లి నుండి హస్మత్ పెట్ వెళ్లే ప్రధాన రహదారి, అంబేద్కర్ రోడ్డు విస్తరణ, బాలానగర్ వై జంక్షన్ నుండి ఎర్రగడ్డ వరకు బ్రిడ్జి నిర్మాణం గురించి, కేపిహెచ్ బి మెట్రో స్టేషన్ నుండి లులు మాల్, జెఎన్ టియు మెట్రో స్టేషన్ వరకు స్కై వే పనులను ప్రారంభించే విధంగా, గోపాల్ నగర్ నుండి అంబేద్కర్ కాలనీ ని కలుపుతూ అల్లాపూర్ లోని సఫ్దర్ నగర్ వరకు రోడ్డు నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఈ పనులు చేపట్టినట్లయితే ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ అభివృద్ధి పనులలో నిధులు మంజూరైన జాప్యం జరుగుతుందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చాన న్నారు. పనులలో అలసత్వం లేకుండా త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేయాలని కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, బిఆర్‌ఎస్ మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






