22 June, 2026 | 3:01 AM

అమరుల స్థూప నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్

22-06-2026 12:27 AM

షాద్‌నగర్, జూన్ 21 (విజయక్రాంతి):  షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ అమరుల స్థూప పనులను స్థానిక ఎమ్మెల్యే, వీర్లపల్లి శంకర్ ఆదివారం పరిశీలించారు. షాద్నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో నిర్మిస్తున్న ఈ స్థూప నిర్మాణ పనులను తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు.

నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేస్తూ, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన అదనపు ఏర్పాట్లపై నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలకు గుర్తుగా నిర్మిస్తున్న ఈ స్థూపం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, ఉద్యమకారుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గ చరిత్రలో ఈ స్మారకం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

వచ్చే ఆదివారం తెలంగాణ అమరుల స్థూపాన్ని ప్రారంభించనున్నట్లు జేఏసీ నాయకులు మూల జనార్ధన్, తిప్పిశెట్టి కరుణాకర్ ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డితో ఎమ్మెల్యే చర్చించారు. స్థూప నిర్మాణానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.