21-12-2025 05:24:49 PM
భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నిర్మాణంలో నాణ్యతతో పాటు వేగనిప్పించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం నగరంలోని ఎంప్లాయీస్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మహిళా సంఘం భవనాన్ని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణపు పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం భవన నిర్మాణ నాణ్యత, ఉపయోగిస్తున్న సామగ్రి, పనుల వేగం తదితర అంశాలపై కాంట్రాక్టర్‌ను వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాంట్రాక్టర్ ఆంజనేయులతో మాట్లాడిన ఎమ్మెల్యే మహిళలకు ఉపయోగపడే విధంగా భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవన నిర్మాణం ఆలస్యం కాకుండా, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి మహిళా సంఘాల సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టంగా ఆదేశించారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మహిళల సాధికారతకు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని, మహిళా సంఘం భవనం వారి అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు అర్షద్ తదితరులు పాల్గొన్నారు.