calender_icon.png 20 December, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన మానవతా సేవకు ప్రతిరూపం

20-12-2025 03:28:50 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో  నగరంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో ఉన్న లిటిల్ స్కాలర్స్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులకు  కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.... మాట్లాడుతూ శారీరక వైకల్యాలతో బాధపడుతున్న వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఇటువంటి కార్యక్రమాలు నిజమైన మానవతా సేవకు ప్రతిరూపమన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ స్వదేశం పట్ల మమకారం, సేవాభావంతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు. దివ్యాంగులకు  స్వయంగా తమ దైనందిన అవసరాలు తీర్చుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేందుకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇలాంటి సహాయక పరికరాలు వారి కదలికలకే కాకుండా, వారి మనోధైర్యాన్ని పెంచి సమాజంలో సమాన అవకాశాలతో ముందుకు సాగేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.  

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు కూడా ఈ విధంగా ముందుకు రావడం వల్ల సమాజంలో సానుకూల మార్పు వేగంగా సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించి మరెందరికో ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతినిధుల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం  అధ్యక్షులు నవీన్ రెడ్డి,  డాక్టర్.విజయ్ పాల్ రెడ్డి, టిటిఎ ప్రతినిధులు, ప్రమోద్ కుమార్, సంపత్, రంగారావు, సాంబశివరావు నాయకులు తిరుమల వెంకటేష్, తిరుపతి , వర్థ రవి, ఖాజా పాషా, ప్రశాంత్, రవికిరణ్ పులిజాల, యేసు, నాచా శ్రీనివాస్, మరియు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.