20-12-2025 04:22:33 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని సెక్యూరిటీ ఆఫీస్, జి.యం కార్యాలయాన్ని సింగరేణి సంస్థ చీఫ్ సెక్యూరిటి ఆఫీసర్ బాలరాజు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్యూరిటీ సిబ్బంది విధులు ఎంతో బాధ్యతాయుతమైనవని, ఎల్లప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేయాలని, భద్రతపరంగా సంస్థ యొక్క ఆస్తులను కాపాడాలని, అన్యాక్రాంతం కాకుండా అనునిత్యం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహించాలని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీ సమయంలో తమకు కేటాయించిన సెక్యూరిటీ పోస్టులను వదిలి బయటకు వెళ్ళరాదని, విధులలో కఠినంగా వ్యవహరించి సంస్థ ఆస్తులను కాపాడాలని తెలిపారు.
అనంతరం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించి ఇల్లందు ఏరియాకు మొదటి సారిగా విచ్చేసిన బాలరాజుని ఏరియా జీఎం వి.కృష్ణయ్య శాలువాతో సత్కరించారు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ఏరియా సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఏరియాలో నిర్వహిస్తున్న సెక్యూరిటీ పరమైన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి.యం. రామస్వామి, సేఫ్టీ అధికారి సి.ఆర్. భాను ప్రసాద్, డీజిఎం పర్సనల్ అజ్మీర తుకారాం, డిజియం ఐ ఈ డి ప్రభాకర్, డీజిఎం (సివిల్) రవి కుమార్, డి.యై.సి.యం.ఓ జి.వి.నరసింహ రావు, ఏరియా సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, ఇతర అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.