20-12-2025 04:17:35 PM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): క్రీడలు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎంత దోహదపడతాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. క్రీడల ద్వారా యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందుతాయని, అందుకే ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ రెండవ రోజు పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అంతకుముందు ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి మొత్తం 16 జట్లు ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయమైన విషయం అని పేర్కొన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, మౌలిక సదుపాయాలు, శిక్షణ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
క్రికెట్‌కు ఉన్న అపారమైన ఆదరణతో పాటు ఐపీఎల్ వంటి టోర్నమెంట్ల కారణంగా యువ క్రీడాకారులకు అవకాశాలు మరింతగా పెరిగాయని, సరైన శిక్షణతో కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమేనని స్పష్టం చేశారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్‌కు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేస్తూ, పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రికెట్ పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, యువతలో ఐక్యతను మరింత బలపరచాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుమ్మరి నరసింహ, జిల్లా కోశాధికారి బాలచందర్, పట్టణ అధ్యక్షులు అంజి యాదవ్, కార్యదర్శి రవికుమార్ యాదవ్ , ఉపాధ్యక్షులు కరీం , ఉపాధ్యక్షులు తైద శీను, శ్రీనివాస్ రెడ్డి , మాజీ జిల్లా అధ్యక్షులు గంజి శ్రీనివాసులు, ముఖ్య సలహాదారులు రాఘవులు, రాముడు , సయ్యద్ నుసురత్, బాబా, వాజిద్, ముక్తదీర్ , ఆర్గనైజర్స్, ఖదీర్, అయుబ్, అమీర్, వసీం, మల్లేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.