20-12-2025 04:24:48 PM
అయ్యప్ప పడిపూజలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): భక్తి సన్మార్గం వైపు నడిపిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం రామయ్య బౌలి ప్రాంతంలోని కామ్లేకార్ సత్యం నివాసంలో బోయపల్లి గేట్ వద్ద పాత్రికేయులు వాకిటి అశోక్ నివాసంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ధర్మం, క్రమశిక్షణ, ఆత్మనియంత్రణకు ప్రతీక అయిన అయ్యప్ప స్వామి మాల ధారణ , అయ్యప్ప స్వామి సందేశం నేటి యువతకు ఆదర్శప్రాయమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని ఆయన తెలిపారు. అలాగే, యాంత్రిక జీవనంలో ఒత్తిడిని దూరం చేసి మనసుకు ప్రశాంతతను అందించడంలో ఇలాంటి పూజా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.