calender_icon.png 27 September, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవులు కాదు.. నమ్ముకున్న సిద్ధాంతం ముఖ్యం

27-09-2025 12:48:00 PM

అలుపెరుగని పోరాట యోధుడు  బాపూజీ 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పదవులు కాదు నమ్ముకున్న సిద్ధాంతం ముఖ్యమని..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ( Konda Laxman Bapuji) అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం మహబూబ్ నగర్ నగరం లోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గారితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ సిద్దాంతాలకు ఆకర్షితుడై రాజకీయాలలోకి వచ్చిన బాపూజీ , తెలంగాణ రాష్ట్రం కొరకు తనమంత్రి పదవికి రాజీనామా చేశారని, ఎందరు ముఖ్యమంత్రులు వచ్చి మంత్రి పదవి ఇస్తామని చెప్పినా ఆయన సున్నితంగా తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు.  ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడుతరాల పాటు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం , సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేశారన్నారు.   ఆయన చూపించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు.  బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ ఎనలేని సేవలను చేశారన్నారు. 

 తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కీలకపాత్ర పోషించి, సాయుధ పోరాటం నుంచి రాజకీయ పోరాటం వరకు తన త్యాగస్ఫూర్తిని చాటారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చూపిన పట్టుదల, విశ్వాసం, తపన తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.  కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధనే లక్ష్యంగా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని,  ఆయన చూపిన మార్గం, విలువలు అందరికీ స్పూర్తిదాయకం కావాలని కోరారు. బాపూజీ ఆశయాల కోసం, సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు, ప్రతి ఒక్కరూ  కృషి చేయాలని  సూచించారు.   బాపూజీ చరిత్ర భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చిన్న , తిరుమల వెంకటేష్,మునీర్ , గంజి ఆంజనేయులు నాయకులు సాయిబాబా ప్రవీణ్ కుమార్, గోవింద్ యాదవ్, అక్బర్ , యాదిరెడ్డి బిసి సంక్షేమ శాఖ అధికారి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.