calender_icon.png 27 September, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం

27-09-2025 12:38:36 PM

  1. నీటి ఉధృతికి కొట్టుకుపోయిన కోకట్ బ్రిడ్జి.. 
  2. 50 ఏళ్ల తర్వాత కోటిపల్లి ప్రాజెక్టు నీరు గ్రామంలోకి చేరింది.. 
  3. జలదిగ్బంధంలో వీర్శెట్టిపల్లి.. 
  4. వరద లో చిక్కుకున్న రక్షక్ వాహనం... 
  5. నీట మునిగిన శ్రీ మహాదేవ లింగేశ్వర దేవాలయం. 
  6. వర్షాకాలంలోనే పాలకుల, అధికారుల హడావిడి.. 
  7. ఆ తర్వాత షరా మామూలే . 

తాండూరు, (విజయక్రాంతి): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుంది. వాగులు వంకలు పొంగి పొల్లుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాండూరు కాగ్న నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో యానాల మండల పరిధిలో ఉన్న కోకట్ బ్రిడ్జి కొట్టుకుపోయింది పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కోటిపల్లి సాగునీటి ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడంతో 50 ఏళ్ల తర్వాత గ్రామంలోకి నీరు వచ్చి చేరింది. గత రాత్రి శ్రీ హనుమాన్ దేవాలయంలోకి మరియు బొడ్రాయి వరకు ప్రాజెక్టు నీరు తాకింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, రాత్రంతా ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారు.

తాండూరు మండలం వీర్ శెట్టి పల్లి గ్రామానికి ఇరువైపులా కాగ్న నది ఉండడంతో నీటి ఉధృతి పెరిగి సమీపంలో ఉన్న బ్రిడ్జిపై నుండి వర్షపు నీరు పొంగిపొర్లుతుంది. దీంతో వీర్శెట్టిపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుంది గ్రామ ప్రజలు బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఓగిపూర్ నాపరాతి గనుల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు వెళ్లిన రక్షక్ పోలీస్ వాహనం వరద లో చిక్కుకుపోయింది. గ్రామస్తులు, పోలీసులు తాళ్ల సహాయంతో కార్మికులను రక్షక్ వాహనంలో చిక్కుకుపోయిన పోలీసులను క్షేమంగా బయటికి తీశారు. తాండూర్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన ఆదర్శనగర్ కాలనీ, గొల్ల చెరువు ప్రాంతం లో భారీగా వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. వర్షాలు కురిసినప్పుడే పాలకులు, అధికారులు హడావిడి చేస్తున్నారని వర్షాకాలం పోయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జి ల నిర్మాణం చేపట్టడం లో షరా మామూలుగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.