నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోండి
సెక్స్ స్కాండల్ కేసుపై మాజీ ప్రధాని దేవెగౌడ
కర్ణాటక, మే 18 : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుపై ఆయన తాత మాజీ ప్రధాని దేవెగౌడ తొలిసారి స్పందించారు. శనివారం తన 92వ జన్మదినం సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమని తేలితే, నేరం రుజువైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, లైంగిక వేధింపులు, మహిళ కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై మాత్రం తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అయితే, ప్రస్తుతానికి ఈ అంశంపై విచారణ జరుగుతున్నందున ఇంతకు మించి ఏమీ మాట్లాడనని వెల్లడించారు.






